Wednesday, July 30, 2025

60-3(29/7/2025)

ఈ రాతలు ఏంటి? చిన్న క్లారిఫికేషన్...
జర్నలింగ్... అంటే, విషయ సమాహారం. ఏరోజు జరిగిన సంఘటనలు ఆరోజే పొందుపరచడం.
ఏంటి లాభం?
అన్నీ లాభాలే. కానీ చెప్పను. ఎవరైనా జర్నలింగ్ అలవాటున్న వ్యక్తులను అడిగి తెలుసుకోండి.
నా ఈ ప్రయత్నం మూడు సంవత్సరాల పాతది. 57-1 అని ప్రారంభించి మూడు సంవత్సరాల తర్వాత కొనసాగిస్తున్నా. ఇప్పటికీ ఏరోజు జరిగినవి ఆరోజు రాయలేక పోతున్నా. రెండు రోజుల సమాచారాన్ని ఒకే రోజు రాస్తే బాలెన్స్ అయిపోతుంది.
ఈ రోజంతా దేవ వెడ్డింగ్ కార్డ్ పని సరిపోయింది. ఆఖరికి కార్డు కొని, కలర్ ప్రింట్ తీయించడానికి నిర్ణయించారు. మొత్తానికి కార్డు 14 రూపాయలు అయింది.
మధ్యలో అత్త ఫొటో ఫ్రేమ్ చేయించాను. చాలా బాగా వచ్చింది. రేపు పెద్ద కర్మ.
ఈరోజూ సంపాదకీయాలు ముట్టుకోలేదు. లేట్ అవుతుంది.

Tuesday, July 29, 2025

60-2(28/7/2025)

పొద్దున్నే ఫోన్. జితేంద్రనుంచి.
నిరంజన్ చనిపోయారని వార్త. మంచి మనిషి. ఆత్మీయత తెలిసిన మనిషి. పెద్దగా పరిచయం లేకపోయినా, ఒకసారి చూస్తే గుర్తుండిపోయే, గుర్తు పెట్టుకోదగిన, గుర్తు పెట్టుకొనే మనిషి. ఒక మనిషి "లేని" (వాయిడ్/శూన్యం/void) తనాన్ని దేనితోనూ పూరించలేము. వాళ్ళ జ్ఞాపకాలని పదిలంగా దాచుకోవడం తప్ప. 
ఐదు రోజుల క్రితం కేశవని నాన్న ఎలా ఉన్నారని అడిగితే బాగానే ఉన్నారు, కొంచెం నీరసంగా ఉంటున్నారు అని చెప్పాడు. ఇంతలో ఇలా....
తాడేపల్లి వెళ్ళాం. కార్యక్రమం అయ్యేవరకు ఉండి వచ్చేశాం.
పొద్దున్నే మురళికి రూ.5000/- పంపించాను. భాగ్యలక్ష్మి అత్త పేరిట గవర్నమెంట్ హాస్పిటల్ లో అక్షయపాత్ర నుండి ఒక వందమందికి అన్నదానం చేసే నిమిత్తం ఆ అమౌంట్ పంపించాను. సాగర్ పేరు మీద రిసీట్ రావాలి. రేపు మురళిని అడగాలి.
తాడేపల్లి నుంచి వచ్చేటప్పటికి మూడయింది. స్నానం చేసి అన్నం తినేటప్పటికి నాలుగు. చంద్రరావు గారి దగ్గరకు వెళ్ళి, లెటర్ డిక్టేషన్ తీసుకున్నాను. అక్కడినుంచి వచ్చేటప్పటికి బాబు, మణి సినిమాకి వెళ్ళారు. రాయలేక పోతున్నందుకు ఆయన బాధపడ్డారు. అది పూర్తి చేసి, ఫైనల్ చేసేటప్పటికి ఏడయింది.
భరణి గారి మిగతా ఇంటర్వ్యూ పూర్తి చేశాను
ఈరోజు కూడా సంపాదకీయాలు ముట్టుకోలేదు.
భరణి గారి ఇంటర్వ్యూ ఇక్కడ

Monday, July 28, 2025

60.1(27/7/2025)

పొద్దు వాలుతున్న సూచనలు రెండు సంవత్సరాల క్రితమే పొడచూపాయి. ఎంత కాలం... తెలియదు. చూద్దాం.
ఈరోజు శ్రీ తనికెళ్ళ భరణిని ఐడ్రీమ్ మీడియా టి.ఎన్.ఆర్. చేసిన ఇంటర్వ్యూ వీడియో చూడటం ప్రారంభించాను. ఎందుకో భరణి గారంటే ఓ అభిమానం. ఈమధ్య ఏకమ్ ఐదోసారి చూశాను. అందులో భరణి ఓ రిటైర్డ్ పూజారి. అరవై సంవత్సరాలకే తనకి రిటైర్మెంట్ ఇప్పించి, యుగాల పర్యంతం దేవుడిగా కొనసాగుతున్న విష్ణువుని వల్లకాడుకి తీసుకెళ్ళి, కపాలమాల వేసి, చితిభస్మం చల్లి దూషిస్తూ ఉంటాడు. కొంతకాలానికి ఓ సత్యాన్వేషకుడు రెండు మూడు ప్రశ్నలతో అతని అజ్ఞానాన్ని తొలగిస్తాడు. నాలుగ్గంటల నిడివి ఉన్న ఇంటర్వ్యూలో రెండు గంటలు మాత్రమే చూడగలిగాను. మిగతాది రేపు. ఈ సంవత్సరం ప్రారంభంలో పుస్తక ప్రదర్శనలో ఓ రోజు భరణి గారు, పవన్ కళ్యాణ్ ఒకే డయాస్ మీద ఉండటం బాగుంది. 
మురళి మహావతార్ నరసింహ సినిమాకి మూడు టికెట్స్ బుక్ చేశాడు. నేను రానని చెప్పేశాను. పిల్లలు ఈవిడ వెళ్తామన్నారు.
విరాజిత టేబుల్ మీద Appointment with death అనే నవల (Agatha Christie రాసింది)ని చూశాను. చదువుదామా అనుకున్నాను, కానీ కళ్యాణ్ ఇచ్చిన టెక్స్ట్ ఇంకా పూర్తి కాలేదు.. ఇంకా పది పేజీలు ఉన్నాయి.
ఈరోజు సంపాదకీయాలు ముట్టుకోలేదు.

Sunday, July 27, 2025

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ శిరస్సు ఎత్తున నిలుస్తోందో
ఎక్కడ ప్రపంచం ఇరుకిరుకు గదుల మాదిరి
అడ్డుగోడలతో ముక్కలు కాకుండా ఉంటుందో

ఎక్కడ మాటలు సత్యగర్భంలోంచి వెలువడతాయో
ఎక్కడ అలుపెరుగని పరిశ్రమ
పరిపూర్ణత వేపు చేతులు చాస్తుందో

ఎక్కడ వివేకం తుచ్చ ఆచారాల మరుభూమిలో
దారి తప్పకుండా ఉంటుందో

ఎక్కడ మనస్సును ఎప్పటికి విస్తరిస్తూ ఉండే
ఆలోచనగా, చర్యగా నీవు నడిపిస్తూ ఉంటావో

ఆ స్వేచ్చా స్వర్గంలోకి.....తండ్రీ.........
...........నా ఈ దేశాన్ని మేల్కొలుపు

__రవీంద్రనాథ్ ఠాగోర్